- 8 నెలల తర్వాత పూర్తిస్థాయి అధికారి నియామకం
- ఇన్చార్జి పాలనలో అక్రమాలు జరిగాయంటున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు
- డిప్యూటేషన్లు, హెడ్ ఆఫీస్ పోస్టింగ్‌లపై విచారణకు డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ గురుకుల సొసైటీకి ఎట్టకేలకు పూర్తిస్థాయి ఐఏఎస్ అధికారి వచ్చారు. గత 8 నెలలుగా ఐఏఎస్ అధికారి లేకపోవడంతో ఇన్చార్జి సెక్రటరీగా ఇంటర్మీడియట్ కళాశాల ప్రిన్సిపాల్ కొనసాగారు. తాజాగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి రవి నాయక్‌ను ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీగా బదిలీ చేస్తూ సీఎస్ సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో 5వ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ వరకు సుమారు 300 స్కూల్స్, కాలేజీలు ఉన్నాయి. వీటిలో దాదాపు 2 లక్షల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. ఇంత కీలకమైన సొసైటీకి 8 నెలలుగా పూర్తిస్థాయి ఐఏఎస్ అధికారి లేకపోవడంపై ఉద్యోగులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 8 నెలల్లో నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు, డిప్యూటేషన్లు జరిగాయని ఉద్యోగులు, అధికారులు ఆరోపిస్తున్నారు. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్చేస్తున్నారు. సొసైటీ 40 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా నాన్-ఐఏఎస్ అధికారికి సెక్రటరీ బాధ్యతలు అప్పగించడంపై కూడా గతంలో ప్రభుత్వానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొంటున్నారు.
రూల్స్ పక్కనపెట్టి డిప్యూటేషన్లు?..
స్టూడెంట్స్‌కు పాఠాలు చెప్పాల్సిన టీచింగ్ స్టాఫ్‌ను హైదరాబాద్‌లోని గురుకుల సొసైటీ హెడ్ ఆఫీస్‌కు డిప్యూటేషన్‌పై తీసుకురావడంపై విమర్శలు వస్తున్నాయి. జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీల్లో పనిచేయాల్సిన పలువురు టీచర్లు, లెక్చరర్లు ఏళ్ల తరబడి హెడ్ ఆఫీస్‌లోనే విధులు నిర్వహిస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కారుణ్య నియామకాల కింద జిల్లాల్లో పోస్టింగులు పొందిన కొందరు ఉద్యోగులు కూడా డిప్యూటేషన్ పేరుతో హైదరాబాద్‌లో కొనసాగుతున్నారని చెబుతున్నారు. సొసైటీ బైలాస్, సర్వీస్ రూల్స్‌కు విరుద్ధంగా ఈ డిప్యూటేషన్లు ఇచ్చారని సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున డిప్యూటేషన్లు జరిగినట్లు టీచర్లు చెబుతున్నారు.
ఇన్చార్జి సెక్రటరీపై ఫిర్యాదులు..
పూర్తిస్థాయి ఐఏఎస్ అధికారి లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని ఇన్చార్జి సెక్రటరీగా ఉన్న ప్రిన్సిపాల్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ఫైళ్లను ఆమోదించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ కాలంలో జారీ చేసిన ఉత్తర్వులు, తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష అవసరమని సంఘాలు కోరుతున్నాయి. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు కూడా గురుకుల సొసైటీలో అక్రమాలు, అవినీతిపై ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి ఇన్చార్జ్ సెక్రటరీని ఆదేశించినట్లు చెబుతున్నారు. అయితే ఆ నివేదిక ఇంకా మంత్రికి అందలేదని సంబంధిత వర్గాలు అంటున్నాయి.
సమగ్ర విచారణకు డిమాండ్..
కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న ఐఏఎస్ అధికారి రవి నాయక్ గత 8 నెలల్లో తీసుకున్న అన్ని నిర్ణయాలు, బదిలీలు, డిప్యూటేషన్లు, హెడ్ ఆఫీస్ పోస్టింగులు, ఆర్థిక వ్యవహారాలపై సమీక్ష చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా హెడ్ ఆఫీస్‌లో కొనసాగుతున్న టీచింగ్ స్టాఫ్‌ను వారి అసలు పోస్టులకు పంపించాలని డిమాండ్ చేస్తున్నాయి. అక్రమాలు జరిగినట్లు విచారణలో తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సంఘాల నేతలు కోరుతున్నారు.
